అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో డ్వామా పిడి సలీం భాషా ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక సదస్సు నిర్వహించడం జరిగింది. మండలంలోని 24 పంచాయతీలలో గత సంవత్సరం మార్చి 31 నుండి 2026 ఫిబ్రవరి మాసం వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో అమలైనటువంటి పనుల జాబితాను పరిశీలించారు. అందులో భాగంగా మస్టర్లలో సంతకాలు లేకపోవడం, జరిగిన పనులలో వివరాలు సరిగా నమోదు కాకపోవడం, పనులు కల్పించిన ప్రాంతంలో కూలీలకు సౌకర్యాల కొరత వంటి సంఘటనలు అధికారుల దృష్టికి రావడంతో తీవ్ర ఆగ్రహం వెలబుచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధి హామీ సిబ్బందిపై జరిమానాలు విధించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తమైతే మరింత కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు. అనంతరం ప్రజా వేదిక సదస్సును కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, ఏపీవో మద్దిలేటి, పంచాయతీరాజ్ ఏఈ మల్లేష్ నాయక్, గృహనిర్మాణ శాఖ ఏఈ సూర్యనారాయణ మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








