గుత్తి: గుత్తి పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి 22 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుత్తి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితురాలిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టయిన నిందితురాలు బెస్త సంధ్య సుమారు ఏడాదిన్నర క్రితం లింగాల రాధా ఇంటిలో పనిమనిషిగా చేరింది. ఇటీవల శివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్కు పిల్లల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బంగారం కనిపించకపోవడంతో వృద్ధురాలు మూడు రోజుల క్రితం గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, నిందితురాలు అపహరించిన 22 తులాలలో 5 తులాల బంగారాన్ని గుత్తిలోని యూనియన్ బ్యాంక్లో తాకట్టుపెట్టినట్లు, మిగిలిన 17 తులాలను తన వద్ద దాచిపెట్టుకున్నట్లు బయటపడింది.
పక్కా సమాచారంతో ఈరోజు గుత్తి ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్.ఐ సురేష్, అమీర్ ఖాన్ మరియు సిబ్బందితో కలిసి గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో ఆమె వద్ద నుంచి 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన 5 తులాల బంగారం విషయమై యూనియన్ బ్యాంక్ అధికారులకు ప్రత్యేక లేఖ రాసి, సంబంధిత బంగారాన్ని పోలీసులకు అప్పగించవలసిందిగా కోరినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, వృద్ధులు ఒంటరిగా నివసించే ఇళ్లలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.








