అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కల చెరువు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మోడల్ ఫౌండేషన్ స్కూల్‌లో అంగన్వాడి కేంద్రానికి చెందిన చిన్నారుల తల్లులు, ఉపాధ్యాయినుల కోసం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. కేశవ నాయుడు మాట్లాడుతూ మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల శక్తి, సామర్థ్యం, ప్రేమ, వాత్సల్యం అపారమని తెలిపారు. కుటుంబం నుంచి సమాజ అభివృద్ధి వరకు మహిళల పాత్ర ఎంతో గొప్పదని ఆయన అన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళ్యాణి, సుప్రియ, నాగరత్న, అంగన్వాడి టీచర్ రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








