అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద వంట గ్యాస్ సిలిండర్ల ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం నాయకులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలేజీ సిలిండర్లతో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు మీ. నిర్మల మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60లు, వాణిజ్య సిలిండర్‌పై రూ.115లు పెంచడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలుపై విధించిన ఆంక్షల కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ధరల పెంపు భారత ప్రజలపై శరాఘాతంగా మారిందని విమర్శించారు.
గ్యాస్ ధరల పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టిడిపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, అధ్యక్షుడు చందు, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు రేవతి, జయమ్మ, ఊర్మిళ, రాము, శ్రీనివాసులు, నాగరత్నమ్మ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.








