అనంతపురం : అనంతపురం జిల్లాలో ఈనెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న గుత్తి కోట ఉత్సవాలు – 2026కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం గుత్తి పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉత్సవాలు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు నిర్వహించబడనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈరోజు రాత్రిలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్‌లో స్టేజ్, స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు వెంటనే సిద్ధం చేయాలని, అలాగే ప్రోటోకాల్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని, శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ముఖ్య అతిథుల కోసం వీఐపీ ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాట్లు ప్రత్యేకంగా ప్రణాళిక ప్రకారం చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఆదివారం నిర్వహించనున్న హెరిటేజ్ వాక్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గుత్తి కోట యొక్క చారిత్రక ప్రాధాన్యం మరియు వారసత్వం గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. మలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, గుంతకల్లు ఆర్డీవో ఆర్‌బీఎస్‌కే శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, డిఎల్డిఓ విజయలక్ష్మి, ఐ&పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, ఎపిఎంఐపి పిడి రఘునాథరెడ్డి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, డిఎస్డిఓ మంజుల, ఆర్కియాలజీ ఎడి స్వామినాయక్, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, తహసీల్దార్లు హరికుమార్, పుణ్యవతి, ఉషారాణి, రమాదేవితో పాటు వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.








