అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్న చారిత్రాత్మక గుత్తి కోటలో వెలసిన అతి పురాతన శ్రీ కోటా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అపూర్వ ఆధ్యాత్మిక దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. చైత్ర మాసం శుద్ధ చవితి సందర్భంగా ఉదయం కచ్చితంగా 6 గంటల 43 నిమిషాలకు భానుడి కిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషంగా నిలిచింది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అరుదైన ప్రకృతి-ఆధ్యాత్మిక ఘట్టం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒక్కరోజే దర్శనమివ్వడం ప్రత్యేకత. ఈ అద్భుతాన్ని తిలకించేందుకు వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పమాలలు, తోరణాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి మూల విగ్రహం చుట్టూ సాంప్రదాయ శైలిలో అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.
పురాణ గాథల ప్రకారం ఈ ఆలయాన్ని కురు, పాండు వంశాలకు చెందిన రాజులు నిర్మించినట్లు చెబుతారు. శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన ఈ ఆలయం సూర్యకిరణాల ప్రవేశానికి అనుకూలంగా రూపకల్పన చేయబడినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల మార్చి 14, 15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 50 లక్షల నిధులతో నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతం కావడంతో ఈ ఆలయానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జరిగిన సూర్యకిరణాల తంతు మరింత విశిష్టతను సంతరించుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని హంపి వీరపాక్ష దేవాలయంలో గాలిగోపురం ప్రతిబింబం తలకిందులుగా కనిపించే అద్భుత సాంకేతికతను పోలి, గుత్తి కోటలోని ఈ ఆలయంలో కూడా సూర్యకిరణాల సూటి ప్రవేశం శిల్పకళా ప్రతిభకు నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.
శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పురోహితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ అరుదైన దృశ్యం చూసిన భక్తులు తమను తాము అదృష్టవంతులుగా భావించారు.








