గజరాంపల్లి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా గజరాంపల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి లక్ష్యంగా స్థాపించిన వ్యాలీ గ్రీన్ గార్మెంట్ ఫ్యాక్టరీ అధినేత పెరుమాళ్ల జీవానంద రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అభిమానులు, ఫ్యాక్టరీ కార్మికులు, పలువురు రాజకీయ నాయకులు భారీగా హాజరయ్యారు.
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవానంద రెడ్డి సేవా స్ఫూర్తిని, దశాబ్ద కాలంగా ఆయన చేసిన సామాజిక సేవలను వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొనియాడారు. ప్రారంభ దశ నుంచి ఇప్పటివరకు ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలపై రూపొందించిన వీడియోను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించగా, అది అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు మహానంద రెడ్డి చేతుల మీదుగా గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారవుతున్న దుస్తులకు సంబంధించిన సరికొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. ఈ బ్రాండ్ దేశంలోని ప్రముఖ బ్రాండ్లతో పోటీపడే స్థాయికి చేరాలని కార్యక్రమానికి హాజరైన వారు ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా 47 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి సందడి చేశారు. అభిమానులు, రాజకీయ నాయకులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో జీవానంద రెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, అభిమానులు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేసి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ వేడుకల్లో పీజేఆర్ అభిమానులు, వ్యాలీ గ్రీన్ గార్మెంట్ మహిళా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








