పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలోని చిన్నవడుగూరు కొత్త రూముల్లో నివసిస్తున్న మంగళ కంబక్క (86) అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి ఒక్క కూతురు మాత్రమే ఉండడం, ఇతర బంధువులు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులను సంప్రదించగా, వారు వెంటనే స్పందించారు. యాడికి నుంచి పెద్దవడుగూరు గ్రామానికి చేరుకున్న ఫౌండేషన్ సభ్యులు, మృతురాలు కంబక్కకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతురాలి చెల్లెలి కూతురు మాట్లాడుతూ, “బంధువులు ఎవరూ లేని సమయంలో ఎవరూ ముందుకు వస్తారా అనే సందేహం ఉండేది. కానీ మీరు స్వయంగా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది” అని కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల ప్రభావంతో యాడికి గ్రామం కోట వీధికి చెందిన ఆడవల యుగంధర్, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్లో కొత్తగా సభ్యుడిగా చేరినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు బండారు బాలకృష్ణ తెలిపారు.
ఈ అంత్యక్రియల కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బండారు బాలకృష్ణ, ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, సాయి వరకు నాగరాజు, కావల సుధాకర్ (వెంకటాంపల్లి), టి లక్ష్మీకాంతమ్మ, ఆడవల యుగంధర్ పాల్గొన్నారు.






