అనంతపురం, గుంతకల్లు : రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడం మరియు మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా “స్టాప్ మైనర్ డ్రైవింగ్” ప్రత్యేక కార్యక్రమాన్ని గుంతకల్లు పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించి 68 మంది మైనర్లను గుర్తించారు.
గుర్తించిన మైనర్ల తల్లిదండ్రులకు ఈరోజు గుంతకల్లు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించిన నిబంధనలు, శిక్షలు మరియు తల్లిదండ్రుల బాధ్యతలను వివరించారు.
పోలీసు అధికారులు తల్లిదండ్రులకు స్పష్టంగా హెచ్చరిస్తూ, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, “మైనర్ డ్రైవింగ్ కేవలం చట్ట విరుద్ధమే కాదు, పిల్లల భవిష్యత్తుకు మరియు ప్రజల ప్రాణ భద్రతకు తీవ్రమైన ముప్పు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి తమ పిల్లలను నియంత్రించాలి” అని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ తరచూ అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని గుంతకల్లు పోలీసులు పేర్కొంటూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సి.ఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








