హైదరాబాద్ : నటుడు బాబు మోహన్ సినీ పరిశ్రమలో తన అనుభవాలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడినని తెలిసిన తర్వాతే తనకు సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయని ఆయన అన్నారు. దీంతో బాబు మోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నటుడిగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా ఇలా వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ తర్వాత రాజకీయల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న బాబు మోహన్ సినీ పరిశ్రమలో కుల వివక్ష ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను దళితుడినని చాలా మందికి తెలియదని, ఈ విషయం తాను కూడా ఎప్పుడు బయటపెట్టలేదన్నారు. కానీ, ఎప్పుడైతే తాను రాజకీయల్లోకి ప్రవేశించిన తర్వాత నా కులం బయటపడిందో అప్పటి నుంచి బాబు మోహన్ దళితుడా? అంటూ కామెంట్లు వినిపించేవన్నారు. ఇదే కారణంతో నాకు వచ్చే సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని తెలిపారు. తనను దూరం పెట్టడం మొదలుపెట్టారని, సినీ పరిశ్రమలో ప్రతిభకు బదులు కులానికే ప్రాధాన్యత ఉంటుందని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.