థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రద్దీగా ఉండే రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆకస్మికంగా భారీ గుంత ఏర్పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సుమారు 30 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతు మేర రహదారి కుంగిపోయింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు గుంతలో పడిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కళ్లముందే రహదారి కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
బ్యాంకాక్ గవర్నర్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ భారీ గుంత కారణంగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. భూగర్భ రైలు స్టేషన్ నిర్మాణం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
రహదారిపై హఠాత్తుగా ఏర్పడిన భారీ గుంతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రహదారి నెమ్మదిగా కుంగిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. గుంతకు దగ్గరగా వచ్చిన కార్లు, ఇతర వాహనాలు వెనక్కి వెళ్లినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది.