మనలో చాలా మంది బ్యాంక్ లాకర్లను వినియోగిస్తుంటారు. విలువైన బంగారం వస్తువులు, డాక్యుమెంట్ల కోసం ఎక్కువ మంది వీటిని తీసుకుంటూ ఉంటారు. కొందరు కరెన్సీ నోట్ల కట్టలను సైతం ఉంచుతారు. లాకర్ నిబంధనలను ఆర్ బీఐ ఇటీవల సవరించింది. ఈ మేరకు కస్టమర్లతో నూతన లాకర్ ఒప్పందం చేసుకోవాలంటూ, 2023 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. చట్టబద్ధమైన వాటి నిల్వ కోసమే బ్యాంక్ లాకర్ వినియోగించుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకని లాకర్ వినియోగదారులు, నిబంధనల మేరకే నడుచుకోవాలి.
నిబంధనల ప్రకారం ఆభరణాలు, డాక్యుమెంట్లను లాకర్లలో పెట్టుకోవచ్చు. కానీ, నగదును ఉంచకూడదు. అలాగే, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ వంటి వాటిని కూడా లాకర్లలో పెట్టకూడదు. పాడైపోయే పదార్థాలు, రేడియోధార్మికత కలిగినవి ఉంచకూడదు. బ్యాంక్ కు కానీ, బ్యాంక్ కస్టమర్లకు కానీ హాని కలిగించే రసాయనాలు, మెటీరియల్ ను సైతం పెట్టకూడదు.
లాకర్ లో పెట్టడానికి అనుమతి ఉన్నవి కూడా జాగ్రత్తగా పదిల పరచుకోవాలని లాకర్ నిబంధనలు సూచిస్తున్నాయి. డాక్యుమెంట్లు అయితే లామినేట్ చేసి పెట్టుకోవాలి. జ్యుయలరీ అయితే ప్లాస్టిక్ లేదా మెటల్ బాక్సుల్లో పెట్టి ఉంచుకోవచ్చు.
లాకర్ లో ఉంచినవాటికి నష్టం ఏర్పడితే అన్ని సందర్భాల్లోనూ బాధ్యత బ్యాంకులపై వేయడానికి కుదరదు. బ్యాంకు నిర్లక్ష్యం, ఉద్యోగుల మోసం వల్ల నష్టం ఏర్పడితే పరిహారం పొందొచ్చు. దోపిడీ, అగ్ని ప్రమాదాల వంటి వాటి కారణంగా లాకర్ లో ఉంచిన వాటికి నష్టం జరిగితే పరిహారం పొందొచ్చు.