బాపట్ల జిల్లా పరిధిలో భూ సేకరణకు సంబంధించిన కోర్టు కేసుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో ఆయన న్యూ విసి హాల్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోర్టు కేసులను ప్రతి కోణంలోనూ నిశితంగా పరిశీలించి, అనంతరం సంబంధిత దస్త్రాలను సక్రమంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది చిత్తశుద్ధి, బాధ్యతాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వులను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటిపై పూర్తి అవగాహనతో పనిచేయాలి అని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందుగానే దస్త్రాలను సిద్ధం చేయాలని, ప్రతి కేసును నిర్ణీత సమయాల్లో పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ జి. గంగాధర్ గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, గ్రామ–వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, వెబ్‌ల్యాండ్ ఇడియం కుమార్ రాజన్ తదితరులు పాల్గొన్నారు.










