నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన ప్రజలపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణ మనోహర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన కుల అహంకారంతో జరిగిన రాక్షసత్వమని ఆయన అభివర్ణించారు.
దైవ దర్శనం కోసం గుడికి వెళ్లిన వెనుకబడిన వర్గాలపై దాడులు జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కుల వివక్షతో మహిళలు, పురుషులను చితకబాదడమే కాకుండా, రెండు నెలల పసికందును తన్ని చంపడం అమానుష చర్య అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నియమించాలని, నిందితులపై సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగంగా విచారణ జరిపి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు తక్షణ రక్షణ కల్పించి, రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. గ్రామాల్లో పెరుగుతున్న కుల వివక్షపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.








