నిజామాబాద్: బీజేపీలో ఉంటూ గత 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులు బయటకు వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని, అయితే దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ భూస్థాపితం అవుతుందన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అర్వింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. “ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా?” అంటూ కవితను ప్రశ్నించారు. నిజామాబాద్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, కేసులు ఉన్నందువల్లే అండగా నిలిచిందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో గెలుపొందగా, ఎంఐఎం 14 డివిజన్లలో విజయం సాధించింది. ఇద్దరు ఎక్స్అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కి చేరి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ 28 స్థానాల్లో గెలిచినా, మేయర్ పదవి మాత్రం అందుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో అర్వింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి.








