విజయనగరం జిల్లా, బొబ్బిలి: రాష్ట్రంలో నిరుపేదలు, వృద్ధులు మరియు వితంతువులకు జీవనాధారం కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతినెలా ఒకటవ తేదీన పింఛన్లు అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో భాగస్వాములై, అర్హులైన ప్రతిఒక్కరికీ వితంతు, వృద్ధాప్య మరియు ఇతర పింఛన్లు అందేలా కృషి చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కూటమి ప్రభుత్వం కొత్తగా 1,08,239 వితంతు పింఛన్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గానికి 787 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి.
ఈరోజు బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామంలో పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) హాజరై, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తొలిసారిగా పింఛను ప్రవేశపెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన గొప్ప ఘనత. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తగిన సమయంలో పింఛన్లు అందిస్తున్నాం,” అని తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, బొబ్బిలి మండల టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, గున్నతోటవలస సర్పంచ్ శ్రీ సింగనపల్లి ఈశ్వరరావు, ఎంపీడీవో రవికుమార్, పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.