బాపట్ల జిల్లా బాపట్ల పట్టణానికి గర్వకారణమైన సంఘటన చోటుచేసుకుంది. నరాలశెట్టి వారి పాలెం గ్రామానికి చెందిన మాజీసైనికుడు రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్ కి కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అరుదైన గౌరవాన్ని అందజేసింది.
దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు డిపార్ట్మెంట్ అఫ్ ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్, మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ (ఢిల్లీ) తరఫున ప్రశంసా పత్రం అందజేయబడింది.
ఈ ప్రశంసా పత్రాన్ని అక్టోబర్ 22న విజయవాడలో గల రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకట రెడ్డి (విఎస్ఎం) రిటైర్డ్ వారు స్వయంగా రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్ కి బహుకరించారు.
రాష్ట్ర త్రిదళ మాజీసైనికుల ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఉపాధ్యక్షులు ఎండూరి హేమన్నారాయణ మాట్లాడుతూ, వర ప్రసాద్ రాష్ట్రం అంతటా మాజీసైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జోన్లలో మొత్తం 26 మందికి సిఎస్‌సి సేవాకేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చి, వారి ద్వారా దాదాపు 200 మందికి పైగా మాజీసైనికుల సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర వహించారని తెలిపారు.
ఈ సందర్భంగా వర ప్రసాద్ మాట్లాడుతూ —
“మాజీసైనికుల సమస్యల పరిష్కారమే నా ప్రధాన ధ్యేయం. పదవులు అవసరం లేకుండానే సేవ చేయడం నా కర్తవ్యం. చెడు వార్తల కన్నా పది మందికి మంచి చేయగలగడం నా నిజమైన గెలుపు” అని అన్నారు.
కార్యక్రమంలో కెప్టెన్ పి. సత్య ప్రసాద్ (రిటైర్డ్), కల్నల్ ఎస్. నరసింహ రావు (రిటైర్డ్), ఫ్లైట్ లెఫ్టినెంట్ డా. ఎం. శ్రీ బాలాజీ (రిటైర్డ్) తదితర అధికారులు పాల్గొని వర ప్రసాద్ సేవలను అభినందించారు.









