రక్షణ రంగంలో రోజురోజుకు బలోపేతం అవుతున్న భారత్ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక క్షిపణి వచ్చిచేరింది. సముద్రతలంపై ఆధిపత్యం సాధించే ఉద్దేశంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘బ్రహ్మోస్’ సుదీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు భారత నావికాదళం ప్రకటించింది.
యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపింది. ఇప్పటి వరకు వీటికి భూ, గగనతల పరీక్షలు నిర్వహించగా, తొలిసారి యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించగల ఈ క్షిపణులు శత్రు దేశ స్థావరాలను తుత్తునియలు చేయగలవు. భారత్-రష్యా సంయుక్త సహకారంతో అభివృద్ధి చేస్తున్న ‘బ్రహ్మోస్’ ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో ఒకటి కావడం విశేషం.