నర్సాపూర్ డివిజన్ — నర్సాపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, అభివృద్ధి అనే ధ్యేయంతో బీఆర్ఎస్ వైపు రాజకీయ నాయకులు పెద్దఎత్తున మొగ్గుచూపుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అమర్ సింగ్ రాథోడ్, నాయకులు సండ్రు, నవీన్, కుండలి కిషోర్, బక్క నరసగౌడ్, బిక్షపతితో పాటు 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ మంత్రి హరీశ్ రావు స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ —
“అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ — ఈ రెండు పార్టీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ప్రజల అభీష్టమే అభివృద్ధి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే. కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ అందరం కలిసికట్టుగా పని చేద్దాం” అని అన్నారు.










