హైదరాబాద్: అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి చేసిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టడం, గొంతు నొక్కడం లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయాలకు పాల్పడుతున్నారనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు.
ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు ఎలాంటి గౌరవం లేదని విమర్శించారు. ఈ దాడిని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి తగిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన ఆయన, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…
జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఎంపీ కొబ్బరికాయ కొట్టగా, అనంతరం ఎమ్మెల్యే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్ లేని వ్యక్తులతో ఎలా కార్యక్రమం నిర్వహిస్తారని ఎంపీతో పాటు ఎమ్మెల్యే ప్రశ్నించడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి దాడికి దారితీసినట్టు సమాచారం.










