contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇది విచారణ కాదు… ప్రతీకారం: కేసీఆర్‌

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది విచారణ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య మాత్రమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. పాలనా లోపాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని, పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ,
“చావు నోట్లో తలపెట్టి, సచ్చుడో సావుడో, తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని దీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్న నాయకుడు ఆయన” అని గుర్తు చేశారు.

అలాంటి నాయకుడిపై అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విచారణల పేరుతో వేధించడం దుర్మార్గమని కేటీఆర్ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎత్తిచూపుతున్నందుకే కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్ష కట్టిందని ఆరోపించారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, కేవలం నోటీసులు ఇచ్చి, బెదిరింపులకు పాల్పడి తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆయన కీర్తిని చెరిపేయలేరని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ అన్యాయ పాలనపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. “చరిత్రను విచారణలతో కాదు… ప్రజల తీర్పుతోనే రాస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :