హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడానికేనా ఈ అగ్ని ప్రమాదం?” అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం అనేక సందేహాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు అత్యంత కీలకమైన, గట్టి భద్రత కలిగిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఈ తరహా ఘటన జరగడం ఆందోళనకరమని తెలిపారు.
ఈ ల్యాబ్‌లో అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు భద్రపరచి ఉన్నాయని, అందులో 2015 నాటి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ఆధారాల పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత ఇవ్వాలని, ఈ ఘటనపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆధారాలను నిర్మూలించేందుకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ కుంభకోణాన్ని ప్రస్తావించారు. అమెరికాలో అనేక మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పదంగా మరణించిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక నిజమైన కారణాలు ఏమిటన్నదానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని, ప్రజలకు నిజాలు వెల్లడించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.








