తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. దీన్ని వేదికగా చేసుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఫైటింగ్‌కు దిగుతున్నారు. రాష్ట్రంలో ఏదో చోట ఏదో రగడ సాగుతోందీ.మొన్న మహేశ్వరంలో గొడవ జరిగితే ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో గందరగోళం నెలకొంది. దీనిపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. అధికార పార్టీ ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడుతోంది. అనవసరమైన విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన గందరగోళం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే కోవలక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్‌పై వాటర్ బాటిల్‌తో కొట్టేంత వరకు పరిస్థితి వెళ్ళింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌లో గల రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యాం నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా.. ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని వారించారు. అలా మొదలైన వివాదం చివరకు ఘర్షణకు దారి తీసింది.
ఎమ్మెల్యే కోవలక్ష్మీ మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెప్పారు. ఆమెను ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దీంతో శ్యాం నాయక్, ఎమ్మెల్యే కోవలక్ష్మి మధ్య మాట మాట పెరిగి రసాబాసకు దారి తీసింది. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ క్రమంలో శ్యాం నాయక్‌ను ఎమ్మెల్యే కోవలక్ష్మీ ,వాటర్ బాటిల్‌తో కొట్టే వరకు వెళ్ళింది.
కంగుతన్న శ్యాంనాయక్, ఆయన అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నించారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా శ్యాం నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. శ్యాంనాయక్ మాట్లాడుతూ.. తనపై బాటిల్‌తో దాడి చేయడం సరికాదని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆమెతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
శ్యాంనాయక్ ఆరోపణలై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఘాటుగా స్పందించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు శ్యాం నాయక్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ మహిళ అని చూడకుండా కిరాయి మనుషులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కాంగ్రెస్ అధిష్ఠానం బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.
మహేశ్వరంలో ప్రోటోకాల్ రగడ
రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. బాలాపూర్ మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో ఈ ఘటన జరిగింది. మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలు చాలా మంది పాల్గొన్నారు. వాళ్లెవ్వరి విషయంలో కూడా ప్రోటోకాల్ పాటించలేదని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులు లేని వాళ్లకు మర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎక్కడ కూడా కాంగ్రెస్ పాలనలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలను అవమానిస్తున్నారని గులాబీ నాయకులు మండిపడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ ప్రాంతంలో జరిగే అధికారిక కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మాదిరిగా చేయం ఏంటని నిలదీస్తున్నారు. కేసులు పెట్టడం నుంచి ప్రోటోకాల్ ఉల్లంఘనల వరకు అన్నింటినీ ప్రజలు చూస్తున్నారని కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తోంది.