ఎండలు దంచేస్తున్నాయి. మున్ముందు భానుడు మరింత చెలరేగిపోతాడని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇలాంటి సమయంలో కారులో ప్రయాణమంటే ఒకటికి పదిసార్లు ఆలోచించక తప్పదు. కారులో ఏసీ ఉన్నా కొన్నిసార్లు ఉక్కపోత తప్పదు. సరిగా వాడకపోవడం వల్ల సమయానికి ఏసీ ఉండీ ఉపయోగంలో లేకుండా పోతుంది. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ప్రయాణంలో వేసవి ఉక్కపోతనుంచి తప్పించుకుని ప్రయాణాన్ని ఎంచక్కా ఆస్వాదించవచ్చు. మరి అదెలాగో చూద్దామా!
నీడలో పార్కింగ్ చేయాలి
ఏదైనా సమస్య వచ్చాక పరిష్కరించడం కంటే అది రాకుండా చూడడం మంచిదన్నది పెద్దల మాట. ఇది కారు ఏసీకీ వర్తిస్తుంది. కారును ఎప్పుడూ నీడలోనే పార్క్ చేయాలి. వేడిగా ఉండే ప్రదేశంలో కానీ, నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో కానీ పార్క్ చేయడం వల్ల ఏసీ దెబ్బతింటుంది. కాబట్టి కారును నీడలో పార్క్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఎండలో పార్క్ చేయాల్సి వస్తే నేరుగా ఎండ తగలకుండా దానిని కవర్లతో కప్పి ఉంచాలి. దీనివల్ల కేబిన్ వేడెక్కకుండా ఉంటుంది. ఫలితంగా ఏసీ ఫంక్షన్ దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాదు, దీనివల్ల ఏసీ మరింత సమర్థవంతంగా కూడా పనిచేస్తుంది.
ఫిల్టర్ క్లీనింగ్
ఇంటి ఏసీల్లానే కారు ఏసీల్లోనూ ఫిల్టర్ ఉంటుంది. ఇది కారు కేబిన్ లోపల ఉంటుంది. వేసవిలో మన దగ్గర కాస్త దుమ్ము లేవడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారాల వ్యవధిలో దానిని శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దుమ్ము పేరుకుపోయి ఏసీ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఏసీ ఏదైనా ఫిల్టర్ క్లీనింగ్ చాలా ముఖ్యం. సాధారణంగా ఏసీ ఫిల్టర్ గ్లోవ్‌బాక్స్‌కు వెనక ఉంటుంది కాబట్టి తీయడం ఏమంత కష్టం కాదు. ఫిల్టర్ మరీ దారుణంగా ఉంటే కొత్తదానితో రీప్లేస్ చేసుకోవడం మంచిది.
ఫుల్ బ్లాస్ట్ మోడ్ వద్దేవద్దు
చాలామంది కారును స్టార్ట్ చేసిన మరుక్షణమే ఏసీని ఫుల్‌బ్లాస్ట్ మోడ్‌లో పెట్టుకుంటారు. కానీ, ఇది ఏమంత మంచి పద్ధతికాదు. ఏసీని తొలుత చిన్నగా పెట్టుకోవాలి. కారు అద్దాలు కొద్దిగా తెరిచిపెట్టుకోవాలి. వేడి గాలి బయటకు వెళ్లిపోయాక అప్పుడు అద్దాలు మూసేసి నెమ్మదిగా ఏసీని పెంచుకుంటూ పోవాలి. ఈ టిప్ చాలా పాతదే అయినా అద్భుతంగా పనిచేస్తుంది.
క్రమం తప్పకుండా వాడకం
ఏసీని క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. అవసరం లేకపోయినా సరే కాసేపైనా వాడాలి. ప్రస్తుతం వస్తున్న కార్లు టెంపరేచర్ కంట్రోల్‌తో వస్తున్నాయి. కాబట్టి ఏసీ ఎప్పుడూ కూల్‌మోడ్‌లోనే ఉండాలి. ఏసీని రెగ్యులర్‌గా వాడుతుండడం వల్ల ఏమైనా పార్టులు పాడైనా మొదటే తెలుస్తుంది కాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించుకోగలిగే వీలుంటుంది. కాబట్టి అత్యవసర సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది.