కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పదేళ్ల క్రితం 2014లో దేశ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని… ఈ పదేళ్లలో ప్రధాని మోదీ డైనమిక్ లీడర్ షిప్ లో దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్ఛస్థితికి చేరుకుందని నిర్మల తెలిపారు. మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక స్థితి మెరుగు పడటానికి దోహదపడ్డాయని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను పటిష్ఠం చేసిందని అన్నారు.
ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని నిర్మల చెప్పారు. నూతన సంర్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని నిర్మల తెలిపారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామని చెప్పారు. రూ. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందించామని తెలిపారు. పేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా రూ. 34 లక్షల కోట్లను అందించామని చెప్పారు. 2047 నాటికి పేదరికం, అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు.
ఏ శాఖకు ఎంతంటే.. (రూ. లక్షల కోట్లలో)
ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ. 2.78
రైల్వే శాఖకు రూ. 2.55
ప్రజా పంపిణీ శాఖకు రూ.2.13
హోం శాఖకు రూ. 2.03
గ్రామీణాభివృద్ది శాఖకు రూ.1.77
రసాయనాలు, ఎరువులకు రూ.1.68
కమ్యూనికేషన్ రూ.1.37
వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27