టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. టీవీలో వస్తున్న వార్తలను చూసి అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కార్యకర్తలు గుండె ఆగి చనిపోయారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన వడ్డే ఆంజనేయులు చనిపోయారు. ఆయన గ్రామంలో టీడీపీ వార్డ్ మెంబర్ గా ఉన్నారు. ఉదయాన్నే పొలం పనులకు వెళ్లి వచ్చి టీవీలో అరెస్ట్ వార్తలను చూసి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన టీడీపీ నేత మైలా శివయ్య కూడా గుండెపోటుతో మృతి చెందారు. టీవీలో వార్తలు చూస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు