తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన జిల్లాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన అన్నమయ్య జిల్లాలోనూ పర్యటించారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడుకు చంద్రబాబు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు భద్రతా విధుల్లో పాలుపంచుకున్న ఓ కానిస్టేబుల్‌కు చెందిన తుపాకీ మ్యాగజైన్ మాయం అయ్యింది. అందులో 30 బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు మదనపల్లె టూర్ ముగిసిన తర్వాత మాత్రమే ఆ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గుర్తించారు. వెనువెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన కానిస్టేబుల్… వారి సూచన మేరకు మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మ్యాగజైన్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు మదనపల్లె టూర్ ముగిసిన రెండు రోజుల తర్వాత శుక్రవారం వెలుగులోకి రావడం గమనార్హం.