తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో తమ గ్రామంలో సుమారు 5 రోజులుగా నీళ్లు రావడంలేదని నీళ్లు సరఫరా చేసి తమ దాహార్తిని తీర్చి ప్రాణాలు కాపాడాలని మండలంలోని మనిపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళితులు అధికారులను వేడుకుంటున్నారు. మోటర్ కాలిపోయిందని రిపేరు చేసిన తర్వాత నీళ్లు వదులుతామని పంచాయతీ కార్యదర్శి రూప నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ చిల్లర నాయకులు చెక్కు చేతుల్లో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ప్రజలు వాపోతున్నారు. కనీసం నీళ్ల ట్యాంకర్లను పంపించైనా దాహార్తిని తీర్చాల్సిన పంచాయతీ కార్యదర్శి నాయకుల మాటలు విని ఐదు రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి వ్యవహారం రాజకీయ ఒత్తుల కారణంగా నీటి ట్యాంకర్లను పంపించకుండా ఉన్నారా లేక వ్యక్తిగతంగా కుల వివక్షతో నీటిని సరఫరా చేయకుండా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. పంచాయతీలో పర్యటించడము అంతంతమాత్రంగానే ఉన్న పంచాయతీ కార్యదర్శి నీళ్ల వ్యవహారంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం మహా పాపమని ప్రజలు తిట్టిపోస్తున్నారు. దళితుల పైన ఇంత చిన్నచూపు తగదని ఐదు రోజులు గడుస్తున్నా సుమారు 80 ఇండ్లకు ఒక చుక్క నీరు రాకపోయినా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు అధికారులకు తెలియకపోవడం విశేషం. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులోత్తే పంచాయతీ కార్యదర్శి తమకు అక్కరలేదని, దళితులను చిన్న చూపుగా చూసే పంచాయతీ కార్యదర్శులు ఇక్కడ నుంచి వెంటనే బదిలీ చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
