ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడంలో కీలక ముందడుగు అని పోలీసు అధికారులు వెల్లడించారు. పక్కా నిఘా సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బృందాలు సంయుక్తంగా అడవుల్లోకి వెళ్లాయి. ఉదయం 10 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా, బలగాలు దీటుగా ఎదురుకాల్పులు జరిపాయి. సాయంత్రం వరకు కాల్పులు అడపాదడపా కొనసాగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్స్, .303 రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మావోయిస్టుల యూనిఫాంలు, కమ్యూనికేషన్ పరికరాలు, విప్లవ సాహిత్యం పుస్తకాలు కూడా లభించాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ స్పందించారు. “ప్రస్తుతం మావోయిస్టు సంస్థ నాయకత్వం, దిశానిర్దేశం లేకుండా నైతికంగా దెబ్బతింది. కేవలం అబూజ్‌మఢ్ అడవుల్లోని కొన్ని ప్రాంతాలకే వారి ఉనికి పరిమితమైంది. నిఘా ఆధారిత ఆపరేషన్ల విజయానికి ఇది నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పించుకున్న మావోయిస్టులు పొరుగు జిల్లాల్లోకి ప్రవేశించకుండా అదనపు బలగాలను మోహరించి, అడవులను జల్లెడ పడుతున్నామని ఆయన తెలిపారు.









