చిత్తూరు: చదువుకునే రోజుల్లో ఇద్దరు అబ్బాయిల మధ్య పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లకే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందులో ఒక అబ్బాయికి మరో అబ్బాయి వింత ప్రపోజల్ పెట్టాడు. అమ్మాయిగా మారితే పెళ్లికి సిద్ధమని ప్రకటించాడు. ఈ క్రమంలో అతడు కోరినట్లే ప్రేమ మైకంలో ఉన్న మరో అబ్బాయి లింగ మార్పిడి చేయించుకున్నాడు. ప్రియుడితో ఎంతో భవిష్యత్తు ఊహించుకున్న అతడికి కోలుకోలేని షాక్ తగిలింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు లోకేష్ గతంలో మదనపల్లెలో ఇంటర్ చదువుకున్నాడు. ఆ సమయంలో మరో అబ్బాయి మహేష్‌తో ప్రేమలో పడ్డాడు. మహేష్ తనను అమ్మాయిగా మారాలని కోరడంతో అతడు చెప్పినట్లే చేశాడు. లోకేష్ తన పేరును స్వీటీగా మార్చేసుకున్నాడు. ఆరు సంవత్సరాలు ఇద్దరూ సహజీవనం చేశారు. ఇటీవల తనకు పిల్లలు కావాలని, అందుకు మరో పెళ్లి చేసుకుంటానని స్వీటీకి మహేష్ షాకిచ్చాడు. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లను మహేష్ గతంలో తన ఫోన్ నుంచి డిలీట్ చేశాడని స్వీటీ పేర్కొంది. మదనపల్లె రూరల్ పోలీసులను శుక్రవారం ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇన్నాళ్ల పాటు తనతో సహజీవనం చేసిన ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని బోరున విలపించింది.