తమకంటూ ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటున్న చైనా గత సోమవారం పంపిన చివరి రాకెట్ భూమిపై పడబోతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతంలో పంపినవి కూడా నియంత్రణ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ పడ్డాయి. అయితే, వీటి వల్ల ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా పంపిన రాకెట్ మాత్రం జనసమ్మర్థ ప్రాంతాల్లో కూలే అవకాశం ఉందని చెబుతున్నారు. 23 టన్నుల బరువుండే ఈ రాకెట్ శిథిలాలు ఎక్కడ పడతాయో తెలియక జనం భయంభయంగా గడుపుతున్నారు.
తుది దశకు అంతరిక్ష నిర్మాణ పనులు
అంతరిక్షంలో చైనా చేపట్టిన న్యూ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ కేంద్రం నిర్మాణం కోసం చైనా గత సోమవారం చివరి మాడ్యూల్‌ను పంపించింది. లాంగ్ మార్చ్ 5బి రాకెట్‌తో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా ప్రకటించింది. ఈ రాకెట్ భూ కక్ష్యను చేరుకున్న తర్వాత తిరిగి భూమిపైకి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించి 28 గంటల రీ ఎంట్రీ విండో నేటి సాయంత్రం మొదలై రేపంతా కొనసాగుతుంది. దాదాపు 10 అంతస్తుల భవనమంత ఉండే ఈ రాకెట్ భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ కొన్ని ప్రధాన భాగాలు మాత్రం భూమిపై పడిపోతాయి.