ఆంధ్రప్రదేశ్ – బాపట్ల – చీరాల : సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్ధులు అలల తీవ్రతకు కొట్టుకుపోయిన విషాద ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహలు లభ్యమయ్యాయి. మరొక ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న పది మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు చీరాల వాడరేవు బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్ సముద్రంలో ఈతకు దిగి అలల తాకిడికి కొట్టుకుపోయారు. స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొద్ది సేపటికే ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురాగా, వాటిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఇద్దరు విద్యార్థులు సోమేశ్ (విట్ విద్యార్థి), గౌతమ్ (చీరాలకు చెందిన యువకుడు) గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వీరి కోసం అగ్నిమాపక, మత్స్యశాఖ సిబ్బంది డ్రాగన్ లైట్లు ఉపయోగించి రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. ఈ ఘటనతో వాడరేవు తీరప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
