ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణ సుదీర్ఘకాలంగా జరుగుతుండడం తెలిసిందే. నేడు నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ కేసుల విచారణ చేపట్టారు. జగన్, ఇతర నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది.
మరోవైపు, జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ నత్తనడకన నడస్తుండడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో విచారణలో జాప్యం చేయరాదని, సీఎం అన్న కారణంగానే విచారణ ఆలస్యమవుతోందన్న వాదనకు ఏం జవాబు చెబుతారని సీబీఐని నిలదీసింది. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందా? అని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల విచారణలో ప్రశ్నించింది.