కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల మోదీకి ఇంత కక్ష ఉంటుందని ప్రజలు అస్సలు ఊహించలేదన్నారు.
‘కేంద్రం నేడు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. మా ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వాలంటూ నేను స్వయంగా 3 సార్లు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశాను. కానీ, కేంద్రం.. తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడటంలేదు. మొదట్నుంచి ప్రధాని మోదీ తెలంగాణ పట్ల కక్ష కట్టారు. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఏ రంగానికి కూడా సహకారం అందించలేదు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని మోదీ అనుకుంటున్నారు.
బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌ను మాత్రమే పట్టించుకున్నారు. ఇతర రాష్ట్రాలను అస్సలే పట్టించుకోలేదు. విభజన ప్రకారం ఏపీకి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణకు ఎందుకివ్వరు..? ములుగు గిరిజన యూనివర్సిటీకి నిధులేవి?. బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించే ప్రయత్నమే చేయలేదు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో ఉన్నారు. అలాంటి తెలంగాణను పట్టించుకోలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ప్రతీ రాష్ట్రంలో ఐఐఎం ఉంది. కానీ, తెలంగాణకు మాత్రమే ఐఐఎం ఇవ్వబోమని ఎలా చెబుతారు?
అలాంటప్పుడు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు కొనసాగాలి..? కేంద్రమంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర హక్కులను మోదీ వద్ద తాకట్టుపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. పోలవరానికి నిధులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వట్లేదు..? తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపించే వివక్ష మంచిది కాదు. ఇకనైనా మోదీ వివక్షను విడనాడాలి.
తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చకపోతే రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లినట్లే. త్వరలోనే నిరసన కార్యక్రమానికి చెందిన కార్యాచరణను రూపొందిస్తాం. కాంగ్రెస్ చేపట్టే నిరసనలకు బీజేపీ ఎంపీలు, ఎంఐఎం కూడా సహకరించాలి. కిషన్ రెడ్డి మౌనం వదిలి రాష్ట్రం కోసం మాట్లాడాలి’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.