హైదరాబాద్ : రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో మండలానికో గ్రామంలో నేడు శ్రీకారం చుట్టారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా, వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాకపోవడం, గ్రామ, వార్డు సభల్లో వివిధ పథకాలకు ఇంకా దరఖాస్తులు వస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో తమ పేర్లు లేవని ప్రజలు ఆందోళనలపై శనివారం సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. దీంతో హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పథకాన్ని ప్రారంభించారు. మిగతా గ్రామాల్లో నాలుగు పథకాల అమలును ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించి, మార్చి 31 వరకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని శనివారం జరిగిన సీఎం, మంత్రుల సమావేశంలో చెప్పారు.
