contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మీడియాకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సంస్థలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తమ మంత్రుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు రాయకూడదని హెచ్చరిస్తూ, మీడియా సంస్థల మధ్య ఏవైనా గొడవలుంటే తలుపులు మూసుకుని తామే తేల్చుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో కుంభకోణం జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏదులాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, “మీకు ఏవైనా వివాదాలుంటే మీరు చూసుకోండి. మా మంత్రుల జోలికి మాత్రం రావద్దు. ఏదైనా రాసేముందు నన్ను వివరణ అడగండి. నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. మా మంత్రులను బద్నాం చేస్తే అది నా గౌరవానికి భంగం కలిగించినట్లే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు మీడియా సంస్థల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ నేతలకు లాభం చేకూరేలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆ మీడియా సంస్థలకు ఆయన హితవు పలికారు.

అనంతరం సింగరేణి అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి, కొన్ని పత్రికలు బొగ్గు మాయమైందని, కుంభకోణం జరిగిందని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. “సింగరేణి టెండర్లను అనుభవం ఉన్న సంస్థలకే ఇస్తాం. ఇందులో అవినీతికి ఎలాంటి అవకాశం లేదు. మా రెండేళ్ల పాలనలో ఒక్క అవకతవక కూడా జరగలేదు” అని స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు చేసుకున్న సీఎం, జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, అప్పట్లో రేషన్ కార్డు పొందాలంటే ఎవరో ఒకరు చనిపోవాల్సిన దుస్థితి ఉండేదని ఆరోపించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు అందించిందన్నారు. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తోందని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ స్ఫూర్తితో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు కేటాయించామని వెల్లడించారు.

భద్రాచలం అభివృద్ధిపై మాట్లాడుతూ, కేసీఆర్ రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. తమ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి, అయోధ్య తరహాలో భద్రాద్రిని అద్భుతంగా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని, రాబోయే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :