contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జీవో 59 పై సియం రేవంత్ కీలక నిర్ణయం

  • జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైళ్ల రీవెరిఫికేషన్‌
  • అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం..
  • రిజిస్ట్రేషన్లు పూర్తయిన స్థలాలకూ మళ్లీ పరిశీలన
  • వీటిలో నిర్మాణాలకు అనుమతులూ ఇవ్వొద్దని ఆదేశం..
  • ఫీజులు చెల్లించిన వాటికి కన్వేయన్స్‌ డీడ్‌ల నిలిపివేత
  • సుమారు వెయ్యి ఫైళ్ల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌?..
  • సీఎం రేవంత్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ
  • నిర్మాణాలు లేకున్నా, ఉన్నట్లు చూపడమే ప్రధాన అక్రమం..
  • శాటిలైట్‌ మ్యాప్‌ల సాయంతో పరిశీలించి చర్యలు

 

హైదరాబాద్‌ : ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేరుతో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జీవో 59 ఆధారంగా జరిగిన అక్రమబద్ధీకరణలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ జీవో కింద క్రమబద్ధీకరణ జరిగిన ప్రతి ఫైలునూ మళ్లీ పరిశీలించాలని నిర్ణయించింది. దీని కింద క్రమబద్ధీకరించిన అన్ని ఫైళ్లనూ రీవెరిఫికేషన్‌ చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. దీంతో రెవెన్యూ శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. జీవో 59 కింద క్రమబద్ధీకరించిన దరఖాస్తులను, ఫైళ్లను మళ్లీ పరిశీలించాలని ఇందులో పేర్కొంది. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల నుంచి ఇళ్లు కట్టుకుని ఉంటున్నవారికి ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేసేందుకు గత ప్రభుత్వం జీవో 59ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆయా భూముల్లో నివాసముంటున్న వారినుంచి కొంత క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేసి.. ఆ స్థలాన్ని వారి పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేసే వెసులుబాటును ఈ జీవో ద్వారా కల్పించారు. అయితే ఇందులో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి నిర్మాణాలు లేని ప్రభుత్వ భూముల్లోనూ ఎప్పటినుంచో నిర్మాణాలున్నట్లు చూపించి.. ఎకరాల కొద్దీ భూమిని ధారాదత్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఈ అక్రమాలపై కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా పరిష్కారమైన, క్రమబద్ధీకరించి రిజిస్ట్రేషన్లు కూడా చేసేసిన ఫైళ్లను మళ్లీ పరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఫీజులు చెల్లించి ఇంకా రిజిస్ట్రేషన్‌ కాని దరఖాస్తులుంటే.. వాటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేయాలని నిర్దేశించింది. కాగా, జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటికి గడువులోపు ఫీజులన్నీ చెల్లించడంతో.. వాటి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తిచేసి రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్‌లూ జారీ చేశారు. అంటే ఆ స్థలాలను దరఖాస్తుదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. ఇలాంటివి పెద్దసంఖ్యలోనే ఉన్నా యి. వీటిని మళ్లీ పరిశీలించాలని, అక్రమాలుంటే నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రిజిస్ట్రేషన్‌ కాని దరఖాస్తుల నిలిపివేత..

క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని, జీవోలో నిర్దేశించిన మేరకు ఫీజులు చెల్లించినా.. కొన్ని స్థలాలకు ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్‌ ఇవ్వడం పూర్తికాలేదు. ఇలాంటి ఫైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి ఫైళ్లు సుమారు 1000 వరకు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ రూ.వేల కోట్లలోనే ఉంటుందని అంచనా. కాగా, జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేసిన ఫైళ్లలో విలువైన భూములు రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే పెద్దఎత్తున దరఖాస్తులు రాగా.. వాటిని పరిష్కరించారు. అయితే క్రమబద్ధీకరణ ముసుగులో వీటిలో పలుచోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలో మొత్తం ఫైళ్లను రీ వెరిఫికేషన్‌ చేయాలని నిర్ణయించారు. మరోవైపు జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేసుకున్న స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వొద్దని కూడా ఆయా జిల్లాల కలెక్టర్లను, జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2023 ఆగస్టు 17 నుంచి జీవో 59 కింద క్రమబద్ధీకరణ జరిగిన స్థలాల ఫైళ్లన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆ తేదీ నుంచి క్రమబద్ధీకరించిన అన్ని ఫైళ్లను మళ్లీ పరిశీలించే పనిని త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతోంది. అవసరమైతే ప్రత్యేక అధికారుల బృందాలను కూడా నియమించి రీవెరిఫికేషన్‌ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

నిర్మాణం లేకుండానే ఉన్నట్లు సృష్టించి..

జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో ప్రధానంగా చోటుచేసుకున్న అక్రమాలేంటన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు అధికారుల నుంచి సమాచారం కోరింది. అయితే ఈ జీవో కింద స్థలాల క్రమబద్ధీకరణకు కావాల్సిన ప్రధాన అర్హత.. సదరు స్థలంలో ఏదో నిర్మాణం చేసి ఉండడం, కొన్నేళ్ల నుంచి అందులో నివసిస్తూ ఉండడం. అయితే ఇక్కడే అక్రమార్కులు నిర్మాణం లేకున్నా ఉన్నట్లుగా చూపించారు. కొందరు అధికారులు ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని క్రమబద్ధీకరించారు. రంగారెడ్డి జిల్లా నానక్‌రాంగూడలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా ఐదెకరాల భూములను అక్రమంగా క్రమబద్ధీకరించారని, దాని విలువ సుమారు రూ.750 కోట్లు ఉంటుందని ‘ఆంధ్రజ్యోతి’ కూడా ఇటీవల వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు రంగారెడ్డి జిల్లాలోని గోపనపల్లిలోను వందల కోట్ల విలువైన భూములను ఇలాగే క్రమబద్ధీకరించడం, అది కూడా సరిగ్గా ఎన్నికల ఫలితాలు రావడానికి ఒక్క రోజు ముందే చేయడంపైనా ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించింది. మరీ ముఖ్యంగా ఎన్నికల షెడ్యూలు వెలువడ్డాక.. పోలింగ్‌కు ఒక రోజు ముందు, చివరకు పోలింగ్‌ రోజు కూడా ఈ ఫైళ్లను క్లియర్‌ చేసిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు శాటిలైట్‌ మ్యాప్‌ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్రమబద్దీకరణ చేసేనాటికి ఆ స్థలాల్లో నిజంగా ఏముంది? ఖాళీగా ఉందా? ఏదైనా ఇల్లు, నిర్మాణం ఉందా? అన్న విషయాలను శాటిలైట్‌ మ్యాప్‌ సాయంతో పరిశీలిస్తారు. దీంతో అక్రమార్కులు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద ఏదైనా నిర్మాణం చేసేసి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూసినా.. అది చెల్లదు. శాటిలైట్‌ మ్యాప్‌ సహాయంతో క్రమబద్ధీకరణ చేసిన తేదీకి ఆ స్థలంలో వాస్తవంగా ఏముందన్నది తెలుసుకోవచ్చు.

న్యాయ వివాదాలు తలెత్తే అవకాశమున్నా..

ఫైళ్లను మళ్లీ పరిశీలించి.. అక్రమాలున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడం న్యాయపరమైన వివాదాలకు దారితీసే అవకాశాలున్నాయి. క్రమబద్ధీకరణ చేశాక రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే కన్వేయన్స్‌ డీడ్‌లోనే.. దీనిపై ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాం టి వివాదాన్ని తీసుకురాదన్న షరతు ఉంటుంది. దీంతో ఇప్పుడు రీ వెరిఫికేషన్‌లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తేలి, వాటిని రద్దు చేయాలని నిర్ణయిస్తే.. లబ్ధిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. అయితే ఇక్కడే ప్రభుత్వానికీ ఓ గట్టి అవకాశం ఉంది. దరఖాస్తుదారు సమర్పించిన సమాచారంలో ఏవైనా తప్పులు, అక్రమాలు ఉంటే వీటి ప్రాతిపదికపై క్రమబద్ధీకరణను తిరస్కరించే అవకాశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉం టుంది. ఇచ్చిన సమాచారంతా సరైనదేనన్న డిక్లరేషన్‌ను కూడా ప్రభుత్వం ముందే తీసుకుంటుంది. నిర్మాణాలు లేనిచోట్ల ఉన్నట్లు చూపించడం అక్రమమైనందున.. ఈ అంశం ప్రాతిపదికగానే రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానాల్లోనూ చెప్పొ చ్చు. తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపైనా కేసులు కూడా పెట్టే అవకాశాలుంటాయి. ప్రలోభాలకు లొంగి అక్రమంగా క్రమబద్ధీకరించిన అధికారులపై ఎలాగూ చర్యలు తప్పవు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :