చేగుంట–తూప్రాన్ డివిజన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బాలమణి డిమాండ్ చేశారు. చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో కూలీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు దొరకక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పని కోసం ఇతర గ్రామాలకు వెళ్లినా అక్కడ కూడా అవకాశాలు లేక తిరిగి రావాల్సి వస్తోందని తెలిపారు. స్థానికంగా ఉపాధి పనుల గురించి అడిగితే పనులు లేవని అధికారులు, సిబ్బంది చెబుతున్నారని కూలీలు వాపోతున్నారని చెప్పారు.
గత సంవత్సరం నుంచి నర్సరీ పనుల్లోనూ అవకాశాలు తగ్గిపోవడంతో జీవనోపాధి మరింత కష్టమైందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే ప్రజలకు మరింత నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు బాలమణి తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 24న మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందరూ పెద్ద ఎత్తున హాజరై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శీను, మల్లయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు








