ఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో అల్ ఫలా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు వైద్యులు అనుమానితులుగా ఉండటంతో ఈ విశ్వవిద్యాలయం వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ఈ విశ్వవిద్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అల్ ఫలా విశ్వవిద్యాలయం తమ వెబ్సైట్లో గుర్తింపునకు సంబంధించి తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు న్యాక్ ఈ చర్య తీసుకుంది. న్యాక్ గుర్తింపు లేకుండా, లేదా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండానే, అల్ ఫలా విశ్వవిద్యాలయం తమ కళాశాలకు గుర్తింపు ఉన్నట్లుగా వెబ్సైట్లో బహిరంగంగా ప్రదర్శించిందని, ఇది పూర్తిగా తప్పని న్యాక్ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ చర్య ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదారి పట్టించడమేనని తెలిపింది. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా, ధౌజ్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్ ఫలా విశ్వవిద్యాలయం విస్తరించి ఉంది. హర్యానా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద ఇది ఏర్పాటైంది. 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా మొదలైన ఈ సంస్థ, 2013లో యూజీసీకి చెందిన న్యాక్ నుంచి ‘ఏ’ గ్రేడ్ అందుకుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనికి విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 2019లో అల్ ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. తమది గుర్తింపు పొందిన విద్యా సంస్థ అని విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రకటనలో కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాక్ నుంచి నోటీసులు రావడం గమనార్హం.









