- బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ తరహాలో స్కూల్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రిన్సిపాల్
- బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్
- రైడ్ చేసి 7 కిలోల డ్రగ్స్, రూ.20 లక్షలు స్వాధీనం
- రూం నెంబర్ 6తో పాటు మరో రెండు గదుల్లో డ్రగ్స్ తయారీ
- ఆ రెండు గదులను ఎప్పటికీ క్లోజ్‌లో ఉంచే డైరెక్టర్
- కెమిస్ట్రీ ల్యాబ్‌లో 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ తయారీ
- సోమవారం నుండి శనివారం వరకు డ్రగ్స్ తయారీ.. ఆదివారం డెలివరీ
- 130 మంది పిల్లలు ఉండే పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. స్కూల్‌నే అడ్డాగా చేసుకున్న డ్రగ్స్ సరఫరాదారులు.. భారీ మొత్తంలో తయారు చేస్తూ ఈగల్ టీమ్‌కు పట్టుబడ్డారు. ఉదయం పూట ఎవరికీ తెలియకుండా ఆ స్కూల్‌లో డ్రగ్స్ తయారు చేస్తూ.. సాయంత్రం పూట ట్యూషన్లు నడిపిస్తూ.. వారి దందా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈగల్ టీమ్.. పక్కా సమాచారంతో దాడి చేసి ఈ ముఠాను పట్టుకుంది. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ టీమ్ .. మత్తు దందా చేసేవారి గుట్టు రట్టు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వాడే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్‌ను తాజాగా ఈగల్ టీమ్ అధికారులు పట్టుకున్నారు. ఏకంగా మూసివేసిన స్కూల్ అడ్డాగా చేసుకుని.. మత్తుమందుల తయారీ చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీమ్ బహిర్గతం చేసింది. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందా ఆటను కట్టించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో ఉన్న మేధా హై స్కూల్ లోపల నిషేధిత ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి.. బయటికి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో గౌడ్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు.. అతడితో పాటు నలుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.
మూసివేసిన మేధా హై స్కూల్‌ను తమ అడ్డాగా చేసుకున్న గౌడ్ అనే వ్యక్తి.. దాన్ని పగటి వేళ డ్రగ్స్ తయారీకి ఉపయోగించేవాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. సాయంత్రం వేళల్లో స్కూల్‌లో ట్యూషన్ తరగతులు కూడా నడిపిస్తున్నట్లు ఈగల్ టీమ్ దాడిలో వెల్లడైంది. ఈ డ్రగ్స్ తయారీ దందా చాలాకాలంగా నడుస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఇక ఈ మేధా హైస్కూల్‌లో తయారు చేస్తున్న ఆల్ఫా జోలం అనే మత్తుమందు అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వెల్లడించారు.
ఈ ఆల్ఫా జోలంను హైదరాబాద్ నగరంలోని కల్లు కాంపౌండ్లతోపాటు.. మరో 3 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఆల్ఫా జోలంను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మేధా హైస్కూల్‌లోని 3 ఫ్లోర్లలో ఈ ఆల్ఫా జోలం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి.. 4 రియాక్టర్ల సహాయంతో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.