Andhra Pradesh: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రహదారులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, 2 వారాలకు ఒకసారి సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందన్నారు.
గిరిజన ప్రాంతాల్లో అడవితల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలీ దూరశ్రవణ సమావేశం నిర్వహించారు. పీఎం జన్‌మన్ పథకంతోపాటు ఉపాధి హామీ, ఉప ప్రణాళిక నిధులు కలిపి రూ.1005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. అడవి తల్లి బాట పేరుతో 2 దశల్లో చేపట్టిన పనుల్లో స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు రహదారి సదుపాయం లేని గిరిజన ఆవాసాలనూ అనుసంధానించేలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
డోలీ రహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రహదారుల కోసం వివిధ పథకాల ద్వారా కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇప్పటి వరకూ రహదారి సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నామన్న పవన్ సవాళ్లు, అవరోధాలను ప్రణాళికాబద్ధంగా అధిగమించాలని అన్నారు. అటవీశాఖ నుంచి రావలసిన అనుమతులపై త్వరలోనే సమీక్షించి ఆ ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనుల గురించి స్థానికులకూ తెలియచేయాలని ఇలా చేస్తే వారి సహకారం, ప్రోత్సాహం లభిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.