contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో పుర, నగరపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు – 73.01% పోలింగ్ నమోదు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పురపాలక మరియు నగరపాలక సంస్థల ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2,981 వార్డులకు పోలింగ్ నిర్వహించగా 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ప్రశాంతంగా సాగిన పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ అనంతరం ఊపందుకుంది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు.

116 మున్సిపాల్టీల్లోని 2,582 వార్డులకు కౌన్సిలర్ పదవుల కోసం ఎన్నికలు నిర్వహించగా, తొమ్మిది పురపాలికల్లోని 12 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడటంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు. మొత్తం 10,719 మంది అభ్యర్థులు మున్సిపాలిటీల్లో పోటీచేశారు. ఇందుకు సంబంధించి 6,017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కార్పొరేషన్లలో ఉత్సాహభరిత పోటీ

రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో 414 వార్డులకు గాను రెండుచోట్ల ఏకగ్రీవం కావడంతో 412 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో మొత్తం 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ 410, బీఆర్‌ఎస్ 401, బీజేపీ 382 అభ్యర్థులను నిలబెట్టగా, ఇతర రాజకీయ పార్టీలు మరియు 578 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కలిపి 52,17,413 మంది ఓటర్లు ఉన్నారు.

వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

8,191 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ పూర్తికాగానే బ్యాలెట్ బాక్సులను భద్రపరచేందుకు 137 స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేశారు. అవసరమైతే రీపోలింగ్ గురువారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈనెల 16న మున్సిపాల్టీల్లో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్; కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి.

పలుచోట్ల స్వల్ప ఘర్షణలు

పురపాలక ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డిలో 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రామాయంపేట 7వ వార్డులో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య స్వల్ప వివాదం నెలకొంది.

చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :