contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Election Code: ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 16న షెడ్యూల్ విడుదల చేసింది. ఆ రోజు నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ఎన్నికల కోడ్ పై రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై ఈ సమావేశంలో చర్చించారు.

అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇవే…

ఎన్నికల కోడ్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా అమలు చేయాలి
కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల కోడ్ మార్గదర్శకాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. కోడ్ సూత్రాలపై సీఈవో ఫార్మాట్ లో అవగాహన పెంచుకోవాలి
ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రజాప్రతినిధుల ఫొటోలు, వీడియోలు, ఆడియోలు వెంటనే తొలగించాలి.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఫ్లెక్సీలు తొలగించాలి
ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ ప్రకటనలను తొలగించాలి
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటే వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఏం చెప్పారంటే…

  • ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు
  • బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నా… కొత్త పథకాలు, ప్రాజెక్టులు, నిధులు, రాయితీలు, శంకుస్థాపనలు, హామీలు ఇవ్వడంపై పూర్తి నిషేధం ఉంటుంది
  • వర్క్ ఆర్డర్ ఉన్న పనుల విషయంలో ఇంకా పనులు ప్రారంభం కాకపోతే, అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదు
    పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదల చేసుకోవచ్చు… దీనిపై నిషేధం లేదు
  • కోడ్ అమలులో ఉన్నందున… ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించరాదు
  • జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు ఎన్నికల కోడ్ అడ్డు రాదు
  • కోడ్ అమల్లోకి రాకముందే ఏవైనా పనులకు టెండర్లు పిలిస్తే ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లవచ్చు… కానీ టెండర్లు ఖరారు చేయరాదు
  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోపు… ప్రభుత్వ ఆస్తులపై ఉన్న వాల్ రైటింగ్స్, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లుల, ఫ్లెక్సీలు, జెండాలు, హోర్డింగులు తొలగించాలి
  • కోడ్ అమల్లోకి వచ్చిన 48 గంటల్లోపు… బహిరంగ ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు. ప్రభుత్వ బస్సులు, రైల్వే వంతెనలు, రహదారి వంతెనలు, మున్సిపల్ ఆడిటోరియంలు, విద్యుత్ స్తంభాలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వాల్ రైటింగులు, కటౌట్లు, పోస్టర్లు తొలగించాలి
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ నిధులతో జారీ చేసే ప్రకటనలు నిలిపివేయాలి
  • ఎన్నికల ప్రకటన వచ్చాక… మంత్రులు అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు
  • ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండరాదు
  • ఎన్నికల ప్రకటన వచ్చాక… ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఫొటోలు తొలగించాలి
  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక… వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, బోర్డింగ్ పాస్ లు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు ఉండరాదు
  • పీఎం కేర్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద అత్యవసర చికిత్సలకు నిధుల మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు
  • గాంధీ జయంతి, సద్భావనా దివస్ వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనవచ్చు… కానీ రాజకీయ ప్రసంగాలు చేయరాదు
  • ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, ప్రచారం చేయడం నిషిద్ధం
  • ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినా, ప్రచారం చేసినా, ఆయా పార్టీల నుంచి ఏవైనా కానుకలు, ప్రయోజనాలు పొందితే వారిపై వివిధ చట్టాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయి

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :