ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో సాక్షి దినపత్రికపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు లంచాలు అడిగారనే అసత్య ఆరోపణలతో సోమవారం ఆ పత్రికలో ‘పైసా మే ప్రమోషన్’ శీర్షికతో ఓ కథనం ప్రచురితమైంది. అందులోని అంశాలన్నీ అసత్యాలేనని, పోలీసు బలగాలు, పోలీస్ ఉన్నతాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో దురుద్దేశపూరితంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై తాడేపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రకటనలు ఇచ్చారంటూ బీఎన్ఎస్‌లోని సెక్షన్ 61(2), 196(1), 353 (2) కింద అభియోగాలు మోపారు. సాక్షి ఎడిటర్, ఆ పత్రిక ఏపీ బ్యూరో చీఫ్, ఏపీ క్రైం రిపోర్టలను నిందితులుగా పోలీసులు చేర్చారు.