పార్వతీపురం టౌన్ : స్థానిక పాత బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్క్రాప్ దుకాణం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెళ్లిళ్ల ఊరేగింపులో భాగంగా బాణాసంచా కాల్పులతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

అగ్ని మంటలు ఎగిసి పడడంతో స్థానికులు స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి హుటా హుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఒక్క అగ్నిమాపక శకటంతో మంటలను అదుపుచేయడం కష్టం కావడంతో బొబ్బిలి నుంచి మరో అగ్నిమాపక శకటం వచ్చి మంటలను సిబ్బంది అదుపు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. బాధితుడికి అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.










