అపార్ట్‌మెంట్లలో నివసించే లక్షలాది మందికి, వాటి సంక్షేమ సంఘాలకు జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. అపార్ట్‌మెంట్ నిర్వహణ (మెయింటెనెన్స్) ఛార్జీలపై జీఎస్టీ విధింపునకు సంబంధించిన గందరగోళానికి తెరదించుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు లోక్‌సభలో కీలక వివరాలు వెల్లడించారు. నెలవారీ మెయింటెనెన్స్ ఛార్జీ ప్రతి సభ్యుడికి రూ.7,500 దాటినప్పుడు మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని ఆమె తేల్చిచెప్పారు.
లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, జీఎస్టీ నిబంధనలను మంత్రి వివరించారు. ఏ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అయినా రెండు పరిధులు దాటినప్పుడే జీఎస్టీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. మొదటిది, అసోసియేషన్ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటాలి (ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఇది రూ.10 లక్షలు). రెండవది, సభ్యుల నుంచి వసూలు చేసే నెలవారీ నిర్వహణ ఛార్జీ రూ.7,500 కంటే ఎక్కువగా ఉండాలి. ఈ రెండు నిబంధనలు వర్తించినప్పుడే ఆ అసోసియేషన్ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ జీఎస్టీ భారం ఫ్లాట్లలో నివసించే వారిపై నేరుగా పడదని మంత్రి హామీ ఇచ్చారు. జీఎస్టీని చెల్లించాల్సిన బాధ్యత పూర్తిగా అపార్ట్‌మెంట్ అసోసియేషన్లదేనని, ఎందుకంటే అవే సేవలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. “నివాసితులు చెల్లించే నెలవారీ మెయింటెనెన్స్ ఎంత ఉన్నప్పటికీ, వారిపై జీఎస్టీకి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు” అని ఆమె తన సమాధానంలో పేర్కొన్నారు.
గతంలో ఈ మినహాయింపు పరిమితి రూ.5,000గా ఉండేదని, 2018 జనవరి 18న జరిగిన 25వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సిఫార్సుల మేరకు దానిని రూ.7,500కు పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు. ఒకవేళ బకాయిపడ్డ పన్నును నిర్ణీత గడువులోగా చెల్లిస్తే, జరిమానా లేకుండా లేదా తక్కువ జరిమానాతో చెల్లించే వెసులుబాటు కూడా కల్పించినట్లు తెలిపారు. జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జీఎస్టీ స్టేటస్ కోసం అసోసియేషన్లు తమ నివాసితుల నుంచి ఎలాంటి అధికారిక లేఖలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.