కరీంనగర్ జిల్లా:ది రిపోర్టర్ టీవీ: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తడానికి కారణం కాకూడదని గన్నేరువరం ఎస్ఐ సిహెచ్ నరసింహారావు అన్నారు. రాబోవు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో ఎస్ఐ నరసింహారావు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వివిధ వర్గాలకు చెందిన ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండే ఎలాంటి పోస్టులు చేయవద్దన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించదలుచుకున్నా పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించాలని కోరారు.ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించకూడదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
