గాజాలో శాంతిస్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్న వేళ కూడా, ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు. శనివారం గాజాపై జరిపిన దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం శాంతి ప్రక్రియపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.
స్థానిక అధికారుల కథనం ప్రకారం, గాజా సిటీలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించారు. బందీల విడుదల, యుద్ధ విరమణ లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సానుకూలంగా స్పందించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
అంతకుముందు, ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలపడంతో, ఇజ్రాయెల్ కూడా ఒప్పందంలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. బందీల విడుదలను ఈ దశలో చేపట్టనున్నారు.
ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నాను. బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఇజ్రాయెల్ తక్షణమే గాజాపై బాంబు దాడులను ఆపాలి” అని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పిలుపునిచ్చారు. ఇది కేవలం గాజాకు సంబంధించింది మాత్రమే కాదని, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాల శాంతికి సంబంధించిన విషయమని ఆయన వివరించారు.
ట్రంప్ విజన్‌కు అనుగుణంగానే యుద్ధాన్ని ముగించడానికి తాము సహకరిస్తామని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే, ఒకవైపు బందీల కుటుంబాలు యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి చేస్తుండగా, మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలోని తీవ్రవాద వర్గాలు దాడులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో నెతన్యాహు తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడితో ఈ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలో గాజాలో 66,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.