contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గీతంలో విజయవంతంగా పైలట్ శిక్షణ కార్యశాల

  • ఫ్లైట్ సిమ్యులేటర్ పై శిక్షణ ఇచ్చిన కెప్టెన్ విగో

 

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ‘ఫ్లైట్ సిమ్యులేటర్’పై ఒకరోజు పైలట్ శిక్షణా కార్యశాలను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, శిక్షకునిగా స్పేస్ జెన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కెప్టెన్ విగో పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్ర్తి వేదాల మాట్లాడుతూ, పైలటింగ్ సిస్టమ్స్ లో అనుభవం గడించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఏరోస్పేస్ లోని ప్రతి విద్యార్థీ కనీసం ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఇంటర్న్ షిప్ లేదా పరిశ్రమ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని స్వీయ అనుభవం గడించాలని సూచించారు. విద్యార్థులకు అనువైన పరిశ్రమలను గుర్తించి, వారితో సంప్రతింపులు జరిపి, విలువైన శిక్షణావకాశాలను పొందాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని తాము అందిస్తామని భరోసా ఇచ్చారు. గీతమ్, హైదరాబాద్ లో ఏరోనాటికల్ సొసైటీ విద్యార్థి విభాగాన్ని ప్రారంభించాలని, అందుకు అవసరమైన రుసుములు సంస్థాగతంగా చెల్లిస్తామని విద్యార్థుల హర్షధ్వానల మధ్య హామీ ఇచ్చారు.

పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంతో పాటు, ఔత్సాహిక ఏరోస్పేస్ ఇంజనీర్ల కెరీర్ అవకాశాలను మెరుగుపరచే లక్ష్యంతో తాను ఈ కార్యశాలను నిర్వహిస్తున్నట్టు కెప్టెన్ విగో తెలియజేశారు. ఈ రంగంలో ఆచరణాత్మక అనుభవం ప్రాధాన్యాన్ని వివరిస్తూ, తమ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 400 మంది వరకు పైలట్ గా ఎంపికయ్యారని, ఇటీవలి పాసింగ్ అవుట్ పరేడ్ లో ఇరవై మంది తమ విద్యార్థులున్నట్టు చెప్పారు.
ఫ్లైట్ సిమ్యులేటర్ ను పరిచేయించడంలో కెప్టెన్ విగో గీతం విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విమానం నిలిపిన ప్రదేశం నుంచి పైకి ఎగిరే వరకు మొత్తం ప్రక్రియను వివరించారు. విమానాన్ని నియంత్రించడం, ఎత్తులో ప్రయాణిస్తూ చేసే విన్యాసాలు, గాలిలో ఉండగానే ఇంజన్ ఆపి డిప్ స్టిక్ ల్యాండింగ్ చేయడం వంటివి చేసి చూపి, ఫ్లైట్ సిమ్యులేటర్ అనుభవాన్ని విద్యార్థులకు కల్పించారు.

తమ ఏరోనాటికల్ సొసైటీ ఆధ్వర్యంలో గీతం ఏరోస్పేస్ విద్యార్థులను ఎయిర్ ఇండియా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భారత వైమానిక దళం స్టేషన్ల సందర్శన ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సందర్శనతో పాటు అక్కడి పైలట్లతో ముఖాముఖి సంభాషణను కూడా ఏర్పాటు చేస్తామని, విమాన నియంత్రణ, ల్యాండింగ్ పద్ధతులు, పారాచూట్ ద్వారా అధిక వేగాన్ని తగ్గించి, సులువుగా ల్యాండింగ్ చేయడం వంటివి స్వయంగా చూసే ఏర్పాటు చేస్తామన్నారు.

తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ.అక్తర్ ఖాన్ అతిథులను స్వాగతించి, ఈ రంగంలో పైలట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి బాధ్యతలను వివరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎస్.కిషోర్ కుమార్ వందన సమర్పణతో ఈ కార్యశాల ముగిసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :