జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలాలను సామాన్యులకు కచ్చితంగా చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత సరుకులపై (స్టాక్) జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా కొత్త ధరల స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు అనుమతి ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో వినియోగదారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని తక్షణమే పొందేందుకు మార్గం సుగమమైంది.
సాధారణంగా ఒకసారి మార్కెట్లోకి విడుదలైన వస్తువులపై ముద్రించిన గరిష్ట చిల్లర ధరను (ఎమ్మార్పీ) మార్చడానికి వీలుండదు. అయితే, ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రానున్న నేపథ్యంలో, అప్పటికే దుకాణాల్లో ఉన్న పాత స్టాక్‌కు కూడా ఈ ప్రయోజనం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీలు తమ పాత స్టాక్‌పై తగ్గిన పన్నుకు అనుగుణంగా కొత్త ధరలతో స్టిక్కర్లు అతికించుకోవచ్చు. అయితే, ఈ స్టిక్కర్ల కింద పాత ఎమ్మార్పీ కూడా స్పష్టంగా కనిపించాలని, కేవలం పన్నుల మార్పు మేరకే ధరల సవరణ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు లేదా పాత స్టాక్ అమ్ముడుపోయే వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. జీఎస్టీ తగ్గింపు అమలులో పారదర్శకతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
భారీగా తగ్గిన వాహనాల ధరలు
ఈ నేపథ్యంలో, జీఎస్టీ తగ్గింపుతో తమ వాహనాల ధరలు ఎంత మేర తగ్గుతాయో పలు ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించాయి. ద్విచక్ర వాహన సంస్థ యమహా తమ బైక్‌లపై రూ. 17,581 వరకు, బజాజ్ రూ. 20,000 వరకు తగ్గింపు ఉంటుందని తెలిపాయి. హోండా కార్ల కంపెనీ తమ మోడళ్లపై రూ. 57 వేల నుంచి రూ. 95 వేల వరకు ధరలు తగ్గుతాయని ప్రకటించింది. మరోవైపు, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తమ వాహనాలపై ఏకంగా రూ. 4.5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు, వోల్వో తమ కార్లపై రూ. 6.9 లక్షల వరకు ధరలు తగ్గుతున్నట్లు వెల్లడించాయి.